Followup – కుటుంబాన్ని మింగేసిన రుణ భారం

భార్య‌, త‌ల్లి, కుమారుడికి విషంతో ఇంటి పెద్ద హ‌త్య
ఆ త‌ర్వాత అత‌డు ఆత్మహ‌త్య‌
క‌ర్నాట‌క‌లోని మైసూరులో ఘ‌ట‌న
ఆర్థిక ఇబ్బందుల‌తోనే మ‌ర‌ణాల‌న్న పోలీసులు

మైసూరు – క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూరులో ఒకే ఇంట్లో న‌లుగురు కుటుంబ స‌భ్యులు విగ‌త‌జీవులుగా క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఓ కుటుంబం ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. మైసూరు విశ్వేశ్వ‌ర‌య్య న‌గ‌ర్ లోని సంక‌ల్ప్ సెరీన్ అపార్ట్‌మెంట్ లో నివాస‌ముండే వ్యాపారి చేత‌న్ (45), అత‌ని భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేత‌న్‌ త‌ల్లి ప్రియంవ‌ద (65) అప్పుల వారి బాధ భ‌రించ‌లేక బ‌ల‌వంతంగా త‌నువు చాలించారు.ముందుగా భార్య‌, కుమారుడు, త‌ల్లికి విషం ఇచ్చి చంపిన త‌ర్వాత చేత‌న్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ముందు చేత‌న్ అమెరికాలో ఉండే త‌న సోద‌రుడికి ఫోన్ చేసి, తాము ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు చెప్పి, ఫోన్ క‌ట్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. దాంతో అత‌ని సోద‌రుడు ప‌లుమార్లు తిరిగి కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పంద‌న రాలేదు. దాంతో స్థానికంగా నివాసం ఉంటున్న బంధువుల‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు. అత‌ని స‌మాచారంతో చేత‌న్ నివాసానికి వచ్చిన బంధువులు న‌లుగురు విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌డం చూసి బోరున విల‌పించారు. అనంతరం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అయితే, చేత‌న్ ఫ్యామిలీ గ‌త 10 ఏళ్లుగా సంక‌ల్ప్ సెరీన్ అపార్ట్‌మెంట్ లో నివాస‌ముంటోందని, ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌నిపించ‌లేద‌ని స్థానికులు పోలీసుల‌కు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *