రైతుల్ని ఇబ్బంది పెడితే రెవెన్యూ కార్యాలయం ముట్టడిస్తాం..

రైతుల్ని ఇబ్బంది పెడితే రెవెన్యూ కార్యాలయం ముట్టడిస్తాం..
మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరిక
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తే రెవెన్యూ కార్యాలయాల్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. నగరంలోని వైస్సార్సీపీ కార్యాలయం లో బుధవారం పేర్ని నాని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మచిలీపట్నం లో రెండు రెవిన్యూ మండలాలు ఉన్నాయని మచిలీపట్నం రూరల్ గ్రామాలలో అనాదిగా వివిధ రకాల పంటలు, ఆక్వా సాగు చేసే విధానం కొనసాగుతోందన్నారు.
గడచిన మూడు నాలుగు నెలలుగా మచిలీపట్నం దక్షిణ మండలం లో మంత్రి కొల్లు రవీంద్ర,ఇద్దరు టీడీపీ నాయకులు ద్వారా చెరువుల సాగుకి ఎకరానికి ఇంత అని రేటు నిర్ణయించి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో సోలార్ కేంద్రం ఏర్పాటు అవుతోందని, ఆక్వా రైతుల సాగుకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు.
