Warangal | పొలం పనులకు వెళ్లి…
Warangal | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : గుర్తు తెలియని ఇసుక లారీ ఢీకొట్టడంతో దుర్గం బాల కృష్ణ(Durgam Bala Krishna) (35) అనే యువకుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో ఈ రోజు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో జరిగింది.
ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపురంలోని ఇందిరా కాలనీకి చెందిన దుర్గం బాలకృష్ణ కమలాపురంలోని కవ్వాలకుంట చెరువు ప్రాంతంలోని తమ పొలంలో పనులు ముగించుకుని పొలం నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కమలాపురం ఆటో స్టాండ్ సమీపంలో గుర్తు తెలియని ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
మృతి చెందిన బాలకృష్ణకు భార్య, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి తమ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దుర్గం బాలకృష్ణ మృతదేహాన్ని ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు.

