కవిత, జగదీశ్‌రెడ్డి మధ్య మాటల మంటలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో పదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిన బీఆర్ఎస్ పార్టీ (BRS party).. ప్రస్తుతం ఒడిదొడుకులకు లోనవుతోంది. ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నిక (Parliamentary election)ల్లో ఒక్క సీటును సైతం గెలుచుకోలేకపోవడంతో ఆ పార్టీకి ప్రతిష్టకు మరింత భంగం కలిగింది. అలాగే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో పార్టీ అధినేత కేసీఆర్ (KCR), ఆయన తనయుడు కేటీఆర్‌కి సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీలోని తాజా పరిస్థితులు పెద్ద తలనొప్పిలా మారాయి. కవిత, జగదీష్ రెడ్డి(Jagadish Reddy)ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో బీఆర్ఎస్ పార్టీలో కుదుపు మొదలైంది.
జగదీష్ రెడ్డి… ఓ “లిల్లీపుట్ నాయకుడు’’ : కవిత
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuṇṭla kavita) కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కవిత “లిల్లీపుట్ నాయకుడు” అంటూ జగదీష్ రెడ్డిని విమర్శించగా, ఆయన ఘాటుగా బదులిచ్చారు. “నా ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లు. కేసీఆర్ శత్రువులు మాట్లాడిన మాటల్నే ఆమె మళ్ళీ చెబుతోంది” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వివాదం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్‌ఎస్ లోపల జరుగుతున్న ఈ గొడవ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కేసీఆర్ లేకపోతే.. ఆ లిల్లీపుట్‌కు అడ్రస్ ఎక్కడిది?
‘కేసీఆర్ లేకపోతే ఈ లిల్లీపుట్‌కు గుర్తింపు ఎక్కడిది. అసలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ల పాత్ర ఏంటి..? ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda District)లో పార్టీని బ్రష్ఠుపట్టించి చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒక్కడే గెలిచిండు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అసలు ఈ లిల్లీపుట్‌కు అడ్రస్ ఎక్కడిది. నా గురించి అంత నీచంగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవటం దారుణం. ఓ పెద్ద నాయకుడు దీని వెనక ఉన్నాడు. నిన్నకాక మెున్న వచ్చిన పిల్ల నాయకులు కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.’ అంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారి తీశాయి.
ఆమె గురించి మాట్లాడటానికి ఏమీ లేదు… : జగదీశ్ రెడ్డి
కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కూడా ఘాటుగా స్పందించారు. “నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లాంటి వారు నా గురించి మాట్లాడిన మాటల్ని ఆమె మరొక్కసారి వల్లె వేసేందుకు చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా” అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆమె గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఆమె గురించి పార్టీలో ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, బయటకు వెళ్తే ఆమెకు ఎలాంటి విలువ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాజాగా కవిత లిల్లీపుట్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.