Viveka murder case: ఉదయ్ కు సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైఎస్ సునీత సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారని, ఆయన బెయిల్ ను రద్దు చేయాలని సునీత కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం.. వివేకా హత్యతో ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించింది.

సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అడిగిన ప్రశ్నకు సునీత తరఫు లాయర్లు బదులిస్తూ.. వివేకా చనిపోయిన తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందన్నారు. వివేకా మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల్లో ఆయన ఒకరని చెప్పారు. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది. అనంతరం వివేకా హత్య కేసు విచారణను వాయిదా వేసింది.

2019 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే, పోస్ట్ మార్టం నివేదికలో గొడ్డలిపోట్ల వల్లే వివేకా చనిపోయారని తేలింది. వివేకా శరీరంపై ఏడు చోట్ల గొడ్డలి గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *