Vijayawada | రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య..

Vijayawada | రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య..

  • మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
  • బీర్ సీసాతో పొడిచి సాయి హత్య
  • పోలీసుల అదుపులో నిందితుడు రాము
  • పాత నేరచరిత్ర ఉన్నట్టు సమాచారం

Vijayawada | రైల్వేస్టేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలోని తారాపేట సౌత్ బుకింగ్ చివరలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడిని సాయిగా గుర్తించగా, హత్యకు పాల్పడిన వ్యక్తిని రాముగా గుర్తించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటల తూటాలు తీవ్రస్థాయికి చేరి, కోపోద్రిక్తుడైన రాము మద్యం సీసాతో సాయి మెడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి నిందితుడు రాము పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రాము మీద ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో డెకాయిట్ కేసు సహా సుమారు 15 క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై జీఆర్‌పీ సీఐ జె.వి. రమణ, ఆర్‌పీఎఫ్ సీఐ ఫతే అలీ బేగ్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రాంతంలో హత్య జరగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మద్యం మత్తు వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply