Vijayawada | ఏపిజేఏసి అమరావతి నాల్గవ రాష్ట్ర మహాసభ

Vijayawada | ఏపిజేఏసి అమరావతి నాల్గవ రాష్ట్ర మహాసభ

  • వేలాదిగా తరలిరావాలని ఉద్యోగులకు పిలుపు
  • లెనిన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : 96 ఉద్యోగ సంఘాల కలయకతో ఏర్పడిన ఏపిజేఏసి అమరావతి ఆధ్వర్యంలో నాల్గవ రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి 5న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జేఏసి నాయకులు ప్రకటించారు. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ… 2017 ఫిబ్రవరి 5న తిరుపతిలో 17 శాఖల ఉద్యోగ సంఘాల కలయకతో ఆవిర్భవించిన ఏపిజేఏసి అమరావతి, నేడు 96 శాఖల సంఘాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఉద్యోగ సంఘంగా ఎదిగిందన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది హక్కులు, రాయితీలు సాధించడమే లక్ష్యంగా నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఫిబ్రవరి 5 ఉదయం 9 గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డుమీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మహాసభలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదే రోజున 21 మందితో కూడిన ఏపిజేఏసి అమరావతి నూతన రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా మంత్రివర్గ సభ్యులు పయ్యాల కేశవ, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్ యాదవ్ హాజరవుతామని హామీ ఇచ్చినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు అందిన ప్రయోజనాలను వివరించడంతో పాటు, ఉద్యోగుల సమస్యలు, ఆవేదనలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ… ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, బకాయిలు తదితర సమస్యలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నమ్మకంతో గెలిపించిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. ఈ మహాసభల ద్వారా ఎంపికయ్యే 21 మంది సభ్యులతో కూడిన నూతన రాష్ట్ర కమిటీ ఉద్యోగులు, పెన్షనర్లు సమస్యల పరిష్కారానికి సమర్థంగా పనిచేస్తుందని స్టేట్ అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు తెలిపారు. ఈ మహాసభలకు హాజరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం ఫిబ్రవరి 4, 5 తేదీల్లో స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేసిన నేపథ్యంలో, ఫిబ్రవరి 5న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర కోశాధికారి కనపర్తి సంగీతరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా జేఏసి చైర్మన్ బత్తిన రామకృష్ణ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఉద్యోగ వర్గంలో దాదాపు 60 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారని, ప్రత్యేకమైన పింక్ డ్రెస్ కోడ్‌తో అధిక సంఖ్యలో హాజరై మహిళా ఉద్యోగుల ఐక్యతను, సత్తాను చాటాలని స్టేట్ ఉమెన్ కమిటీ చైర్‌పర్సన్ పారే లక్ష్మి, స్టేట్ సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, కోశాధికారి డా. వి.ఎస్. సాయిలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపిజేఏసి అమరావతి నాయకులు లోవకుమార్, బత్తుల కిశోర్ కుమార్, యస్. మల్లేశ్వరరావు, కోనా ఆంజనేయకుమార్, వేల్పుల అర్లయ్య, ఆర్. శ్రీనివాసరావు, ఈదులమూడి మధుబాబు, గరికపాటి బ్రహ్మయ్య, మందపాటి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply