అమరావతి : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జగన్ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులిచ్చింది.
ఇవాళ ఉదయం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో విజయ సాయిరెడ్డి రెండో నిందితుడు (ఏ2) కాగా, జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. కేఎస్పీఎల్, కేసెజ్ లో వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. రెండు నెలల కిందట సాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఇదే వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి హాజరయ్యారు.