Vijay Hazare Trophy | కుర్రాళ్లు క‌మ్మేశారు..

Vijay Hazare Trophy | కుర్రాళ్లు క‌మ్మేశారు..

ఆంధ్ర‌ప్ర‌భ : టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రాంచీ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊహకందని ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని అందుకున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు) వరల్డ్ రికార్డు సృష్టించాడు. గతంలో జహూర్ ఎలాహి పేరిట ఉన్న రికార్డును సూర్య‌వంశీ తుడిచిపెట్టాడు.

వైభవ్ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి ఏబీ డివిలియర్స్ (64 బంతులు) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. చివరకు 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్లతో 190 పరుగులు సాధించి తృటిలో డ‌బుల్ సెంచ‌రీని చేజార్చుకున్నాడు. 15 ఏళ్ల లోపు వయసులోనే లిస్ట్-ఏ, టీ20 రెండింటిలోనూ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు.

రికార్డుల వేటలో ఒకరిని మించి మరొకరు!

ఇదే మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్ సాకిబుల్ గని మరింత బీభత్సం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా అన్‌మోల్ ప్రీత్ సింగ్ (35 బంతులు) రికార్డును అధిగమించాడు. సాకిబుల్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 128 (నాటౌట్) పరుగులు చేశాడు.

మరోవైపు ఈరోజే అహ్మదాబాద్‌లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆరో స్థానంలో వచ్చి విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న ఇషాన్, లిస్ట్-ఏలో రెండో ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జార్ఖండ్ జట్టు 412 పరుగుల భారీ స్కోరు సాధించడంలో ఇషాన్ 125 పరుగుల ఇన్నింగ్స్ కీలకమైంది.

బీహార్ వీరబాదుడు…

అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ బ్యాటర్లు జరిపిన దాడికి.. 50 ఓవర్లలో 574/6 పరుగుల భారీ స్కోరు నమోదైంది. విజయ్ హజారే ట్రోఫీతో పాటు ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు. 2022లో తమిళనాడు (506/2) సాధించిన రికార్డును బీహార్ అధిగమించింది. విశేషమేమిటంటే రెండు సందర్భాల్లోనూ బాధితురాలు అరుణాచల్ జట్టు కావడం. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ (190), ఆయుష్ లోహారుక (116), సాకిబుల్ గని (128*) ముగ్గురూ శతకాలతో చెలరేగారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 498 పరుగుల రికార్డును కూడా బీహార్ ఈ మ్యాచ్‌లో సునాయాసంగా దాటేసింది.

బీహార్ బ్యాటర్ల ధాటికి అరుణాచల్ బౌలర్లు నిస్సహాయులయ్యారు. మిబోమ్ మోసు తన 9 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మరో ఇద్దరు బౌలర్లు కూడా వంద పరుగులకు చేరువగా ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్లు మొత్తం 38 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించారు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్లు..

  • ఇంగ్లండ్ 498/4 నెదర్లాండ్స్ 2022
  • ఇంగ్లండ్ 481/6 ఆస్ట్రేలియా 2018
  • ఇంగ్లండ్ 444/3 పాకిస్తాన్ 2016

    లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు..

    • బీహార్ 574/6 అరుణాచల్ ప్రదేశ్ 2025 (నేడు)
    • తమిళనాడు 506/2 అరుణాచల్ ప్రదేశ్ 2022
    • ఇంగ్లాండ్ 498/4 నెదర్లాండ్స్ 2022
    • సర్రీ (Surrey) 496/4 గ్లౌసెస్టర్‌షైర్ 2007

    Leave a Reply