Video conference | రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి

Video conference | రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి

  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Video conference | కర్నూలు ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : రెవెన్యూ క్లినిక్‌లు, స్పెషల్ క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీలు, ఇతర రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ రోజు పత్తికొండ డివిజన్ పరిధిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాం పట్టాలు, చుక్కల భూములు, రీ సర్వే ప్రక్రియ తదితర అంశాలపై తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ వారం ఒక డివిజన్‌లో స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించి, రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌లు, స్పెషల్ క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీలు, రీ సర్వే, వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్, ఇనాం భూములు, చుక్కల భూములు, నిషేధిత జాబితా తదితర రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఒక నెలలోపు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, తప్పులు జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ రీ–సర్వే పూర్తైన గ్రామాల్లో తుది డిఎల్ఆర్ (Final DLR) ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, ఎటువంటి లోపాలకు తావు లేకుండా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నపాటి తప్పిదాల వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ప్రతి దశను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అలాగే ఇనాం, చుక్కల భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం ఇనాం, నిషేధిత జాబితా, రీ సర్వే తదితర రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. పతికొండలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply