- తెలంగాణకు రెండు కాంస్యాలు
భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రా అమ్మాయి జ్యోతి యర్రాజీ 38వ జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల హర్డిల్స్ 100 మీటర్ల ఫైనల్లో 25 ఏళ్ల తెలుగు తేజం జ్యోతి 13.10 సెకన్లలో రేసును పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డుతో మూడో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో యర్రాజీ 2023 జాతీయ క్రీడల్లో తన 13.22 సెకన్ల రికార్డును తిరగరాసింది. ఆదివారం ఒకే రోజు జ్యోతి తన రికార్డును రెండుసార్లు సవరించుకోవడం విశేషం. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడల్లో జ్యోతికి ఇది వరుసగా మూడో బంగారు పతకం.
రెండో స్థానంలో నిలిచిన వెస్ట్ బెంగాల్‌కు చెందిన మౌమిత మండల్ రజత పతకం, తమిళనాడు అథ్లెట్ నిత్య రామ్‌రాజ్ మూడో ప్లేస్‌లో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు 2025 ఎడిషన్‌లో ఇది 5వ బంగారు పతకం కావడం విశేషం.
4-100మీ రిలేలో తెలంగాణకు కాంస్యం..
మరోవైపు మహిళల 4-100మీ రిలే ఈవెంట్‌లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. 4-100మీ రిలే ఫైనల్లో నిత్య గాంధీ, మలోత్ సింధు, అగసారా నందిని, ఎమ్ అకుమదుప్లలతో కూడిన తెలంగాణ బృందం 47.58 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ పోటీలో కర్ణాటక (45.99సె) జట్టుకు స్వర్ణం లభించగా.. 47.04సె.లో రేస్‌ను పూర్తి చేసిన కేరళ టీమ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది.
మరోవైపు నెట్‌బాల్ ఈవెంట్‌లోనూ తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టు ఇప్పటివరకు మొత్తం 9 పతకాలు సొంతం చేసుకుంది. అందులో ఒక స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.