చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఘనంగా గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ కూడలిలో పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతాన్ని ఏకస్వరంగా ఆలపించారు. జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు, పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్ఆర్. రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, వందేమాతరం కేవలం గీతం మాత్రమే కాదు, భారతీయుల గుండెల్లో దేశభక్తి జ్యోతి వెలిగించిన ఆత్మీయ నినాదమన్నారు. బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య సమరంలో కోట్లాది భారతీయుల్లో త్యాగస్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఈ గీతం స్ఫూర్తిని అర్థం చేసుకుని దేశ సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ‘వందేమాతరం పాడినప్పుడు గర్వభావం మన హృదయాల్లో నిండిపోవాలి, ఎందుకంటే అది మన భారతీయతకు ప్రతీక’ అని తెలిపారు.

జిల్లా అంతటా ఈ రోజు వందేమాతరం గీతం మార్మోగడంతో దేశభక్తి స్ఫూర్తి మరింతగా అలుముకుంది. బంకిమ్ చంద్ర చటర్జీ వంటి మహానుభావుడు అందించిన స్ఫూర్తిని స్మరించుకుంటూ, దేశ ఐక్యత కోసం అందరూ కలసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యుడు, సబ్‌డివిజన్ డీఎస్పీ టి. సాయినాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ వీరేశ్, చిత్తూరు మేయర్ అముద, చిత్తూరు చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

