Union Minister | డీ లిమిటేషన్ ప్రకటనతో అలజడి

Union Minister | డీ లిమిటేషన్ ప్రకటనతో అలజడి

  • ప్రధానిపై దిగజారుడు మాటలు
  • 6 గ్యారంటీలపై ద్రుష్టి మళ్లించేందుకు డ్రామాలు
  • కాళేశ్వరం డిజైన్ లోపం బాధ్యత కేసీఆర్ దే
  • కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు
  • కవిత పార్టీని స్వాగతిస్తున్నాం
  • సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

Union Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసేందుకు సిద్దమవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. అందుకే ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారని, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్ లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్ దేనని చెప్పారు.

అయినప్పటికీ కేసీఆర్ ను, కాళేశ్వరం అవినీతి పరులను రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయడం లేదన్నారు. కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్కక్కవడంవల్లే కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ఆరు గ్యారెంటీల ఊసే లేదు..

ఓట్ల కోసం 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలిస్తారు. అధికారంలోకి వచ్చాక గాడిద గుడ్డు చూపిస్తారు. లాగుల తొండలు విడుస్తానని అంటారు. ఇదేందని మేం మాట్లాడితే గుండు, బండి అని మాట్లాడతారే తప్ప ఆ హామీలను అమలు చేయాలనే సోయే ఉండదు.

కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం..

ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. స్వాగతిస్తాం. అయితే ప్రజల కోసం, పేదల కోసం ఏ పార్టీ పనిచేసినా ఆ పార్టీకే మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కాళేశ్వరం డిజైన్ లోపం బాధ్యత కేసీఆర్ దే..

కాళేశ్వరం డిజైన్ లోపానికి ప్రధాన కారకులు కేసీఆరే. ఎందుకంటే ఆయన ఇంజనీర్ అవతారమెత్తారు. అనేక వేషాలు వేసి డిజైన్లు తయారు చేశారు. కాబట్టి దీనికి ప్రధాన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం డిజైన్ కారకులను, అవీనీతిపరులను అరెస్ట్ చేయడం లేదు.

ఎందుకంటే కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్కక్కయ్యారు. అందుకే అవినీతికి పాల్పడినా, డిజైన్ లోనే లోపముందని తేల్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఇదేమని అడిగితే కేంద్రంపై నెపం మోపి తప్పించుకోవాలని చూస్తున్నారు. సీబీఐకి పంపిన లేఖలోనూ పూర్తిస్థాయిలో వాస్తవాలు చెప్పలేదు.

దక్షిణాదిరాష్ట్రాలకు నష్టం లేదు..

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి జరిగే నష్టం ఏమిటో ఇప్పటి వరకు సీఎం చెప్పలేదు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎట్లా జరుగుతుంది? 6 గ్యారంటీల అమలు చేయడం చేతగాక ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఈ డ్రామాలాడుతున్నరు.

మహిళలకు నెలకు రూ.2500లు, వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి, రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, మహిళలకు తులం బంగారం, స్కూటీ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి.

ముందు వాటి సంగతి తేల్చిన తరువాత మాట్లాడాలి. అంతే తప్ప వాటిని అమలు చేయలేక రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసి ప్రజలను దారి మళ్లించేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రాభివ్రుద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్దంగా ఉంది. రాజకీయాలను పక్కనపెట్టి అభివ్రుద్ధిపైన, 6 గ్యారంటీల అమలుపైన ద్రుష్టి సారించాలని కోరుతున్నా.

Leave a Reply