మంటలు ఆర్పలేక వెనకడుగు
- కళ్లముందే రూ.కోటి ఆస్తి బుగ్గిపాలు
- శ్రీకాకుళం జిల్లాలో నిర్లక్ష ఫలితం
ఆంధ్రప్రభ, కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : కూతవేటు దూరంలో అగ్నిమాపక కేంద్రం ఉంది. అకస్మాత్తుగా అర్ధరాత్రి తరువాత అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే జనం సమాచారం ఇచ్చారు. అటు అగ్ని కీలలు రేగిపోతున్నాయి. ఆపత్కాలంలో దూసుకు వచ్చే అగ్నిమాపక రథం జాడ లేదు. ఫైర్ ఇంజన్ గంటలు వినపడటం లేదు. జనం కంగారెత్తిపోయారు. కళ్ల ముందే కోట్లాది రూపాయల ఆస్తి భస్మంగా మారుతోంది. ఎట్టకేలకు తెల్లావారుజామున మూడు గంటలకు నిక్కుతూ.. నీల్గుతూ విపత్తు నియంత్రణ దళం చేరుకుంది. కాసేపు నీళ్లు చల్లింది. ఇంకేముందీ నీళ్లు అయిపోయాయి, అనే చావు కబురు చెప్పి అగ్నిమాపక కేంద్రానికి తరలిపోయింది. ఆ తరువాత పాలకొండ దళం ప్రత్యక్షమైంది. అప్పటికే మిగిలిన బూడిదపై నీళ్లు చల్లి.. తమ కార్యం మమ అనిపించింది. బాధితుడు మాత్రం కళ్ల ముందే కోటి రూపాయలు బూడిదలో కలిశాయని గగ్గోలు పెట్టాడు.

శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కొత్తూరు జనాన్ని కకావికలం చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కొత్తూరు లోని అగ్నిప్రమాదం అలజడి రేపింది. బత్తిలి రోడ్డులోని కమల హార్డ్ వేర్ అండ్ ప్లే వుడ్ దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం కలవరం రేపింది. ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయలు ఆస్థి నష్టం జరిగినట్టు షాప్ యజమాని రాజస్థాన్ మార్వాడీ వజ్రం చెబుతున్నారు. రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్లక వేరే చోట తమ కుటుంబంతో దసరా నవరాత్రి పూజలకు వెళ్లిపోయామని, రాత్రి 1 గంటకు మెడికల్ షాప్ యజమాని ఫోన్ చేస్తే, ఆ తర్వాత అదే బత్తిలి రోడ్డులో కూతవేటు దూరంలోని కొత్తూరు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా, వేకువ జాము మూడు గంటల తర్వాత వచ్చి మంటలు అదుపు చేశారు.

ఫైర్ ఇంజన్ నీళ్లు అయ్యిపోయాయంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత పాలకొండ నుండి ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చేసరికి దుకాణం అంత కాలిపోయి బూడిద అయ్యింది. ఇక భళ్లున తెల్లారేసరికి కొత్తూరు పొగచూరిపోయింది. ఈ ప్రమాదాన్ని నివారించటంలో కొత్తూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఫైర్ ఇంజన్ వాహనంలో సరిపడా నీటిని నిల్వ చేసుకోవాల్సిన విధిని విస్మరించారా? లేక భారీ అగ్ని ప్రమాదం కావటంతో నీరు సరిపోలేదా? అగ్ని ప్రమాద తీవ్రతను సిబ్బంది ముందుగా ఎందుకు అంచనా వేయలేదు? మరిన్ని వాహనాల అవసరాన్ని గుర్తించి సమీప కేంద్రాలకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే.. కొంతలో కొంత నష్టం తప్పేది కదా అని స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
