ఇంద్రకీలాద్రి పై ఉగాది ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రి పై ఉగాది ఉత్సవాలు..
- మార్చి 19 నుంచి 28 వరకు..
- ప్రత్యేక పుష్పార్చనలు, పూజలు వైదిక కార్యక్రమాలు..
- ఉగాది రోజున వెండి రథోత్సవం..
- శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం…
- పూర్తి ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి అధికారులు..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పుష్పార్చనలు, హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించింది.
ఉగాది రోజున ప్రత్యేక పూజలు..
మార్చి 19న గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుఝామున 3 గంటలకు అమ్మవారికి ఉపాలయాల దేవతామూర్తులకు స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అలంకారం, అర్చన, నివేదన, హారతి జరుగుతుంది. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 9.15 గంటలకు నూతన పూజామంటపం వద్ద కలశ స్థాపనతో ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు కళావేదికలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు యాగశాలలో మండప పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, రుద్రహోమం జరుగుతుంది.
సాయంత్రం 6 గంటలకు శ్రీ మల్లికార్జున మహామండపం నుంచి వెండి రథోత్సవం ప్రారంభమవుతుంది. వెండి రథోత్సవం కనకదుర్గ నగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమలావిలాస్, రమణయ్య కూల్ డ్రింక్స్ దుకాణం, బోడెమ్మ హోటల్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ మీదుగా తిరిగి మల్లికార్జున మహామండపానికి చేరుతుంది. చైత్ర శుద్ధ అష్టమి రోజున ఉదయం 6 గంటలకు ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి, ఘాట్ రోడ్ ఉపాలయంలోని అభయ ఆంజనేయస్వామికి, అలాగే అమ్మవారి మెట్ల వద్ద ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం, నాగవల్లి దళార్చన (తమలపాకులతో ఆకు పూజ) నిర్వహిస్తారు.
శ్రీరామనవమి వేడుకలు..
మార్చి 27న శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు కళావేదికలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 28న శనివారం ఉదయం 9 గంటలకు వసంత నవరాత్రి ఉత్సవాల పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం కళావేదికలో నిర్వహిస్తారు.
ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు..
మార్చి 19 నుంచి 27 వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు వివిధ పూలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తారు. మల్లె, మరువం, కనకాంబరం, గులాబీ, చామంతి, మందార, కలువ, జాజి, సంపంగి వంటి పుష్పాలతో పూజలు జరుగుతాయి. ప్రత్యేక పుష్పార్చన సేవ రుసుము రూ.2,500గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు శేషవస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్రపీఠం, పెద్ద లడ్డూ ప్రసాదంగా అందజేస్తారు. అదే విధంగా ఇరువురికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు.
టికెట్ల పొందే విధానం..
భక్తులు ప్రత్యేక పుష్పార్చన టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా దేవస్థానం ఆర్జిత సేవా టికెట్ విక్రయ కేంద్రాల్లో పొందవచ్చని అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది.

