ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వానికి చిహ్నాలు
ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి
ఇంచార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్.
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగాచిత్తూరు జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ఇన్చార్జి కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం కాణిపాక ఆలయ పండితులు ఆచార్యులు శ్రీ చిలకమర్తి వెంకట సుబ్బారావు ఆచార్యులు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే ఒక ముఖ్యమైన సందర్భమని అన్నారు.

ఉగాది అంటే “యుగానికి ఆది” అని, తెలుగు ప్రజలందరికీ ఇది నూతన సంవత్సర ప్రారంభమని వివరించారు. అయితే, ఉగాది ఒక పండుగకే పరిమితం కాకుండా మన మూలాలను, విలువలను తిరిగి ఆలోచించుకునే ఒక ‘రిమైండర్’గా భావించాలన్నారు.

ప్రస్తుత కాలంలో వ్యస్తమైన జీవితాల మధ్య మనం మన సంస్కృతి, సంప్రదాయం, భాషలను మరచిపోతున్నామని, ఇతర సంస్కృతుల ప్రభావం పెరుగుతున్నప్పటికీ మన మూలాలను గుర్తుంచుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. అనంతరం డి ఆర్ ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ, ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి కొత్త సంవత్సర ప్రారంభమవుతుందని, ప్రకృతి పునరుజ్జీవం చెందే ఈ కాలంలో తెలుగు వారి సాంప్రదాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఉగాది అనేది “ఉగాది ” అంటే యుగానికి ఆది అని అర్థమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ కవులు, కళాకారులు, పండితులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హంస రత్న అవార్డుల ప్రదానం ద్వారా వారి ప్రతిభను గుర్తించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమం నిర్వహణకు తక్కువ సమయం లభించినప్పటికీ, రచయితల సమాఖ్య మరియు వివిధ కళాసంస్థల సహకారంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. తొందరపాటులో ఏర్పాట్లు చేయాల్సి వచ్చినందున ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లయితే క్షమించాలని సభలో పాల్గొన్న కవి, పండితులు, కళాకారులను కోరారు.
ఉగాది పండుగను ఒక పండుగగా మాత్రమే కాకుండా, మన జీవిత విలువలను గుర్తు చేసుకునే అవకాశంగా భావించి, ప్రతి ఒక్కరూ తమ మూలాలకు మరలాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదుగురు వేద పండితులకు వెంకట సుబ్బారావు, శ్రీధర్ అయ్యర్, పద్మనాభ గురుకుల్, రామకృష్ణ ఆచార్య, అర్చకం పార్థసారథి సత్కారం చేశారు. అలాగే వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి సన్మానం మరియు ఉగాది పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టూరిజం అధికారి ఎ ఎమ్ నరేంద్ర కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, సర్వశిక్షా అభియాన్ పిడి వెంకటరమణ, ఎస్ ఇ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు,చిత్తూరు ఆర్ డి ఓ శ్రీనివాసులు, టూరిజం మేనేజర్ గౌరీ,రచయితల సంఘం అధ్యక్షులు వల్లేరు హరి, వేద పండితులు, కవులు, ప్రజలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
