కంచికచర్ల (ఆంధ్రప్రభ) : కంచికచర్ల మండలం మొగులూరు గ్రామ శివారులోని పామాయిల్ తోట సమీపంలో మున్నేరు వద్ద ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని స్థానికులు వెలికితీయగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మొగులూరు గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు మున్నేరు–కృష్ణా నదికి వెళ్లారు. అందులో ఇద్దరు ఒడ్డున ఉండగా, మరో ఇద్దరు నీటిలోకి దిగారు. అయితే కొద్ది సేపటికే వారు నీటిలో మునిగిపోవడంతో తోటి స్నేహితులు భయపడి గ్రామానికి వెళ్లి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఒకరి మృతదేహం బయటపడింది. అతడిని మొగులూరు గ్రామానికి చెందిన షేక్ ఖుద్దూస్ (24)గా గుర్తించారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గల్లంతైన మరో యువకుడు షేక్ షారుఖ్ (19) కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రప్పించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి కమ్ముకున్నా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.