పుష్కరిణిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి..

ఆముదాలవలస, ఆంధ్రప్రభ : పట్టణంలోని రామలింగేశ్వర పుష్కరిణిలో పడి ఆదివారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన పట్టణాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. స్థానిక గణేష్‌నగర్‌కు చెందిన సురవరం పవన్ సాయి (8), శంకు ధనుష్ (6) అనే బాలురు ఆడుకుంటూ కోనేరు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డారు.

ఇద్దరూ మునిగిపోతున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలురను అంబులెన్స్‌లోకి ఎక్కించి ప్రథమ చికిత్స అందించినప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం తెలుసుకున్న ఆముదాలవలస పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమ చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించగా, దృశ్యాన్ని చూసిన వారు కూడా కంటతడి పెట్టుకున్నారు. చెరువు చుట్టూ సరైన రక్షణ కంచె లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply