The Success Story | మ‌హిళ క్రికెట్ ప్ర‌పంచంలో త్రిష సంచ‌ల‌నం..

  • బ్యాటింగ్ , బౌలింగ్ ఇరగ దీస్తున్న తెలుగమ్మాయి
  • చిన్న త‌నంలో టీమ్ ఇండియాలో స్థానం
  • కుమార్తె కోసం స‌ర్వం త్యాగం చేసిన తండ్రి.
  • తండ్రి క‌ల‌ను నెర‌వేర్చిన త‌న‌య
  • 13 ఏటే రాష్ట్ర సీనియ‌ర్ జ‌ట్టులో ఎంట్రీ
  • అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త్రిష మెరుపులు

త్రిష గొంగిడి… ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ యువ క్రికెటర్ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో సత్తాచాటి టీమిండియాకు మరో అద్భుత విజయాన్ని అందించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ అదరగొట్టిన ఈ ఆల్ రౌండర్ భారత్ కు మరో అండర్ 19 వరల్డ్ అందించింది.

ఇలా యావత్ భారతదేశమే గర్వించేలా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న ఈ అమ్మాయి మన తెలుగింటి ఆడబిడ్డే. అయితే తెలుగు క్రికెటర్లు నితీష్ కుమార్ రెడ్డి, గొంగిడి త్రిషది సేమ్ టు సేమ్ స్టోరీ. ఈ ఇద్దరి విజయం వెనక వున్నది తండ్రులే. తమ బిడ్డల కెరీర్ కోసం ఈ తండ్రులు తమ కెరీర్ ను త్యాగం చేసారు. ఇప్పుడు తమ బిడ్డల సక్సెస్ చూసి మురిసిపోతున్నారు.

త్రిష సక్సెస్ లో తండ్రి…

ఇప్పుడు గొంగిడి త్రిష యువ సంచలనం… కానీ ఆమె ఈ స్థాయికి రావడంలో ఆమె తండ్రి త్యాగాలు ఉన్నాయి. తన కెరీర్ నే కాదు పుట్టి పెరిగిన ఊరిని కూతురు కోసం వదిలిపెట్టాడు. అంతేకాదు కూతుర్ని క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు ఆమెకు కోచ్ గానే కాదు డ్రైవర్ గా కూడా మారాడు. ఇలా అతడి కొన్నేళ్ల శ్రమకు దక్కిన ఫలితమే ఇప్పుడు త్రిష అద్భుతమైన ఆట. కూతురి అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన ఆ తండ్రి ఇన్నేళ్ల కష్టాలను, అవమానాలను మరిచేలా చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నివాసి గొంగిడి రామిరెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో ఫిట్ నెస్ ట్రైనర్. అతడికి క్రీడలంటే ఎంతో ఇష్టం… అందుకే తనకు పుట్టబోయే బిడ్డను అటువైపు నడిపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి ఆడపిల్ల పుట్టింది… అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ అమ్మాయినే క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఆయనే కోచ్ గా మారి కూతుర్ని క్రీడలవైపు నడిపించాడు.

ఒక్కగానొక్క కూతురు త్రిషకు ఏ క్రీడల్లో ఆసక్తివుందో గుర్తించేప్రయత్నం చేసాడు రామిరెడ్డి. మొదట టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడించిన ఆయన చివరకు కూతురు క్రికెట్ కు సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఆమె కూడా క్రికెట్ పై మక్కువ చూపించేది… తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచులు ఆసక్తిగా చూసేది. ఇలా కూతురు ఇష్టం, తన ఆలోచన ఒకటే కావడంతో త్రిషను క్రికెట్ వైపు నడిపించారు రామిరెడ్డి.

ఇలా ఆడబిడ్డను క్రికెటర్ చేయడమేంటని చాలామంది అవమానించారు… ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి… అయినా ఆ తండ్రి వెనకడుగు వేయలేదు. చివరకు కూతురు కెరీర్ కోసం తన కెరీర్ నే వదులుకున్నాడు… ఫిట్ నెస్ ట్రైనర్ ఉద్యగాన్ని వదిలిపెట్టి కూతురు కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. చివరకు పుట్టిపెరిగిన ఊరిని వదిలేసి కూతురికి మెరుగైన క్రికెట్ శిక్షణ కోసం హైదరాబాద్ కు వలసవెళ్లాల్సి వచ్చింది.

తండ్రి కల నెరవేర్చిన త్రిష..

కూతురు త్రిషను ఎలాగైన టీమిండియా క్రికెటర్ గా చూడాలన్నది రామిరెడ్డి కల. అది సాకారం చేసేందుకు ఆయన ఎంతటి త్యాగాలకైనా సిద్దపడ్డాడు. తన ఉద్యోగాన్ని, పుట్టిపెరిగిన ఊరిని వదిలేసి కుటుంబంతో హైదరాబాద్ కు మకాం మార్చాడు. త్రిషను సికింద్రబాద్ లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చాడు.

ఓవైపు క్రికెట్, మరోవైపు చదువు…ఇలా రెండింటిని బ్యాలన్స్ చేయిస్తూ కూతుర్ని ముందుకు నడిపించాడు. తండ్రి తనకోసం చేస్తున్న త్యాగాలను చూస్తూ పెరిగిన త్రిష ఆయన కలను నెరవేర్చేందుకు మరింత కష్టపడేది. ఇలా క్రికెట్ లో మెళకువలు నేర్చుకుని కసితో ఆడేది… ఇలా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టేది. చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపుపొందింది త్రిష.

హైదరాబాద్ లో జరిగే వివిధ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపుపొందింది. దీంతో 2017-18 సీనియర్ మహిళల టీ20 లీగ్ లో హైదరాబాద్ తరపున ఆడే అవకాశం వచ్చింది. అందులో రాణించిన త్రిషకు 2021-22 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఛాలెంజ్ ట్రోఫీలో భారత్ బి తరపున ఆడే అవకాశం వచ్చింది.

అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకువెళ్లిన త్రిషకు 2023లో మహిళల అండర్ 19 టీమ్ లో చోటుదక్కింది. ఈ ఏడాది జరిగిన మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ఆడింది… ఫైనల్లో 24 పరుగలతో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచింది. ఇలా గతేడాది అండర్ 19 వరల్డ్ కప్ గెలుపులోనూ మన తెలుగుమ్మాయి త్రిష అదరగొట్టింది.

అండర్ 19 వరల్డ్ కప్ లో త్రిష మెరుపులు..

మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో త్రిష అద్భుతంగా రాణించారు. మొదటినుండి దూకుడుగా ఆడుతూ టీమిండియాను విజయతీరాలను చేర్చారు. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విసిరిన 83 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.2 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది టీమిండియా.

ఇందులో అత్యధిక పరుగులు మన తెలుగమ్మాయి త్రిషవే (44 పరుగులు). అలాగే మొదటి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాను కేవలం 83 పరుగులకే కట్టడి చేయడంలో త్రిష పాత్ర కీలకం. ఆమె మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీసింది. అటు బ్యాటు, ఇటు బాల్ తో రాణించిన త్రిష టీమిండియాకు మరో వరల్డ్ కప్ అందించింది.

ఈ అండర్ 19 వరల్డ్ కప్ లో టాప్ స్కోరగా నిలిచింది త్రిష. సూపర్ సిక్స్ లో స్కాంట్లాండ్ పై చెలరేగి ఆడిన త్రిష కేవలం 59 బంతుల్లోనే 110 (13 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో అదరగొట్టింది. ఇలా మహిళల అండర్ 19 వరల్డ్ కప్ 2025 మెగాటోర్నీలో సెంచరీ బాదిన మొదటి క్రికెటర్ గా త్రిష నిలిచింది. మొత్తంగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ నిలిచింది మన గొంగిడి త్రిష.

ఇలా ఓ తండ్రి త్యాగాలకు ఫలితమే నేడు మనముందుకు గొంగిడి త్రిష. కూతురు సక్సెస్ ను చూసి రామిరెడ్డి మురిసిపోతున్నాడు. తన కూతురు టీమిండియాలో ఆడుతుంటే చూడాలని ఆ తండ్రి కోరుకుంటున్నారు. ఆ కల కూడా త్వరలోనే నెరవేరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *