వెంకటస్వామికి నివాళులు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మాజీ కేంద్ర మంత్రి వెంకట స్వామి కాకా ఆదర్శనీయులని, ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కాకా జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మారు మూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు జి.వెంకట స్వామి అని అన్నారు. కేంద్ర మంత్రిగా, వివిధ పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వ కారణమన్నారు. అట్టడుగు వర్గాల వారికి మన వంతు సహకారం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
మన ప్రాంతంలోని పేదలకు వెంకటస్వామి అనేక సేవలు అందించారని, ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించారని కలెక్టర్ కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి, పేదల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి పని చేశారని గుర్తు చేశారు.
కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికుల గుండెల్లో చిరస్థాయి స్థానం పొందారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రవీందర్, సురేష్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు ప్రకాష్, కేవై ప్రసాద్, సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.