Tribute | మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే

Tribute | మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే
- ఆమె స్ఫూర్తిని నేటితరం మహిళా ఉపాధ్యాయురాలు అందిపుచ్చుకోవాలి
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Tribute | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఇవాళ నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ ) లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాగర్ కర్నూల్, డీఈఓ రమేష్ కుమార్ ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారన్నారు. తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కులవివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు.

ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వాటిని లెక్కచేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అని, విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3 వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి అధికారికంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని 15మంది ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళా ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
