Traveled | నా ఆకాంక్ష అదే – పరిటాల సునీత..

Traveled | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీతమ్మ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ఆమె, రైతులు, వ్యవసాయ కూలీలతో మమేకమై పొలం పనుల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యవసాయమే రాష్ట్రానికి వెన్నెముక అని, రైతుల కష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పై ఉందని పరిటాల సునీతమ్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పంటల సాగు విధానాలు, విత్తనాల ఎంపిక, సాగునీటి లభ్యత, ఎరువుల వినియోగం వంటి అంశాల పై రైతులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా వరి, వేరుశనగ, మినుము, కంది వంటి పంటల సాగు పరిస్థితులను పరిశీలించి, దిగుబడుల పై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలతో కలిసి ఆమె కొంతసేపు పని చేయడం ద్వారా వారి శ్రమకు గౌరవం తెలిపినట్లయ్యింది. వ్యవసాయ కూలీలకు ఉపాధి, వేతనాల సమస్యలు, పని వేళల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పై కూడా ఆమె స్పందించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవ్వాలని, రైతులు, కూలీలు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విత్తనాలు, ఎరువులు, సాగు నీరు, పంటల భీమా వంటి అంశాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇలాంటి క్షేత్ర స్థాయి పర్యటనలు ఎంతో అవసరమని, ప్రజాప్రతినిధులు రైతుల మధ్యే ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె పేర్కొన్నారు.

రైతు దినోత్సవం సందర్భంగా రైతుల శ్రమను స్మరించుకోవడం మాత్రమే కాకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపడమే నిజమైన నివాళి అని పరిటాల సునీతమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రాల సందర్శనతో రైతుల్లో ఉత్సాహం నెలకొనగా, తమ సమస్యలు నేరుగా వినిపించే అవకాశం లభించిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
