శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

శంషాబాద్, ఆంధ్రప్రభ : ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెతో పాటు మాజీ మంత్రి హరీష్ రావును శంషాబాద్ ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పరిగి ప్రాంత భూ బాధితులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని అడ్డుకున్నా భూ బాధితుల పక్షాన మా పోరాటం ఆగదు. వారికి న్యాయం జరిగే వరకు మా సహాయ సహకారాలు కొనసాగుతాయి” అని స్పష్టం చేశారు.
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కుతున్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం చర్యలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కేవలం అరెస్ట్ మాత్రమే కాకుండా భూ బాధితుల గళాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నమని ఆరోపించారు.
