జాతీయ సాఫ్ట్‌బాల్‌కు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ఈ నెల 16 ఢిల్లీలో నిర్వహించనున్న 69వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ అండర్–14 పోటీలకు జడ్పీహెచ్ఎస్ తొర్లికొండ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో కే కిషోర్, బాలికల విభాగంలో ఎల్ అంజలి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు, పాఠశాల చైర్మన్ గంగా జమున మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత నెల మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన 69వ స్కూల్ రాష్ట్ర గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలలో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న కే కిషోర్, ఎల్ అంజలి జిల్లా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు మాట్లాడుతూ తొర్లికొండ గ్రామానికి చెందిన విద్యార్థులు ఢిల్లీలో జరిగే జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనడం గర్వకారణమన్నారు. తొర్లికొండను క్రీడా గ్రామంగా అభివృద్ధి చేసి క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply