కృత్తివెన్నుపై దండయాత్ర
మడ అడవుల్లో విధ్వంసం
పర్రల్నీ వీడని కబ్జాదారులు
తాజాగా 300 ఎకరాల్లో వాలిన చేపల గద్దలు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కండ్లు మూసుకున్న మత్స్యశాఖ
మామూళ్ల మగతలో తూలుతున్న అటవీశాఖ
మంత్రి లోకేశ్ రెడ్ బుక్ శరణ్యమా?
ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలో నిడమర్రు పంచాయతీ గరిసపూడి, పంచాయతీ శివారు తాడివెన్ను గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూముల్లో భీమవరం గద్దలు వాలిపోయాయి. ఇక్కడ లేదు.. అక్కడ లేదు. సముద్ర ఆటుపోట్ల నీటికి చిరునామా పర్రనూ ఆక్రమించి.. వందల ఎకరాల్లో అక్రమ చెరువుల తవ్వకాన్ని ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తాడివెన్ను రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 44 లో 1047 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది. ఇది ఒక పర్ర. సముద్రం ఆటుపోట్లతో ఎల్లకాలమూ నీరు పలకరిస్తుంది. నిత్యం ఆపన్నుల ఆకలి తీర్చే జల పుష్ఫాల సందడి సర్వసాధారణం. ఇక సముద్ర ఆటుపోట్లకు చేపల మాఫియా బ్రేక్ వేస్తోంది. చుట్టు కట్టలు నిర్మిస్తోంది. ఇప్పటికి సుమారు 300 ఎకరాలపై కన్ను వేసింది. ఎక్కడో చేపల సామ్రాట్టుల చేపట్టిన ఈ దండయాత్రకు ఎవరు సహకరిస్తున్నారు. ఇలాంటి దందాలకు లోకల్ హీరోల సహకారం అత్యవసరం. ఏమి జరిగిందో ? ఈ భూ పందేరానికి మార్గం సుగమం అయ్యింది. నెల రోజులుగా పాటు, పోటు నీటి భూముల్ని చేపల చెరువుల తవ్వకాల కోసం నీళ్లు ఎండగడుతున్న రెవెన్యూ అధికారులు కిమ్మనలేదు. ఇది ప్రభుత్వం భూమి అని స్పష్టంగా కనిపిస్తున్నా.. భగవద్గీతగా భావించే ఆర్ ఎస్ ఆర్ సైతం ఈ భూమిని ప్రభుత్వం భూమి అని స్పష్టం చేసినా.. రెవెన్యూ శాఖ గాంధార పాత్ర పోషించటం విశేషం.
అసలు ఈ భూమి కథేంటంటే..
ఈ ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ చెరువుల తవ్వాకాల వెనుక ఆసక్తికర కథ ఉంది. ఈ కథ వింటే విస్తూపోయే నిజాలు పగలబడి నవ్వుతాయి. అరవై ఏళ్ల కిందట శివాజీ జమీందారులు అనే పేరుతో బీమవరం, నరసాపురం వలస పక్షులు ఇక్కడ వాలిపోయాయి. సర్కారీ భూముల్ని చందాల రూపంలో పంచేసుకున్నారు. ఈ వలస రాజులు తాత్కాలిక నివాసలతో పెద్ద చందాల, చిన చందాల అనే ఊళ్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలో ఈ శివాజీ జమీందారులు పొందిన ఈ భూముల్ని మైగ్రేటెడ్ కింగ్స్ అమ్మేసుకుని తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు రాజులు గాని ఆ రాజ వంశస్థులు గాని ఎవ్వరూ ఇక్కడ లేరు. అప్పట్లో తక్కువ ధరలకు ఈ భూములు పొందిన ఓ బడా భూస్వామికి గంపగుత్తగా లీజుకి యిచ్చాం అంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని ఓ కథ వినపడుతోంది. నిజానికి వీళ్లేవరూ సాగు చేయలేదు.. ప్రభుత్వానికి శిస్తులూ కట్టలేదు. అసలు ప్రభుత్వ భూమిని గంప గుత్తగా ధారాదత్తం చేసే హక్కు ఎవరికీ లేదు.
ఈ సహజ సంపద ధారాదత్తమే
గత ఐదేళ్లల్లో కృత్తివెన్ను మండలంలో చేపల మాఫియాకు అప్పటి మంత్రి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన కూడా పర్ర భూముల్ని వశం చేసుకున్నారు. ఇప్పటికి చిన పాండ్రాక ఉప్పునీటి భూములపై కోర్టులో వివాదం నడుస్తోంది. సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. ఇక్కడ కూడా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో రొయ్యల చెరువులు వెలవటంతో.. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. ఇక నిడమర్రు పర్ర భూముల వ్యవహారం కూడా పెద్ద స్కామ్ గా వెలుగు చూసిన నేపథ్యంలో.. ఇటు రెవెన్యూశాఖ, అటు మత్స్యశాఖ, ఇంకో వైపు అటవీశాఖ, వీటి సరసనే మైనింగ్ శాఖ కూడా అభియోగాలను పంచుకోక తప్పటం లేదు. ఈ నిడమర్రు గ్రామం పరిసరాల్లో మడ అడవులు.. ఉప్పునీటి పర్రలు ఎస్ ఈజెడ్ లో లేవని అధికారులు నోటి మాటగా వాదిస్తున్నారు. అసలు ఈ భూములు ఎస్ ఈజెడ్ లో ఉన్నాయా? లేదా? ఒక వేళ లేకపోతే ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందా? లేదా? కాదు పక్కా పట్టా భూమి అనుకుంటే.. భూమి యజమానులు ఎక్కడ? అసలు చేపల చెరువుల తవ్వకానికి మత్స్యశాఖ అనుమతి ఉందా? ఈ అనుమతి ఎలా ఇచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం..సున్నా..