తక్షణమే పునరావాస కేంద్రాలకు..

తక్షణమే పునరావాస కేంద్రాలకు..

బాప‌ట్ల‌, ఆంధ్ర‌ప్ర‌భ : మొంథా తుపాను ప్రభావం దాటికి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్(Dr. V Vinod Kumar) తెలిపారు. కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా అధికారులకు సోమవారం వీక్షణ సమావేశం ద్వారా ఆయన పలు సూచనలు చేశారు.

తుపానుకు ప్రాణ నష్టం ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్థిరమైన నిబంధనలు అనుసరించి కేంద్రాలు నడపాలన్నారు. ఐదు నియోజకవర్గాలలోని 944 నివాస ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలోని వారి కొరకు ప్రభుత్వ పాఠశాలల(Govt. Schools)ను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో 1,547 మంది గర్భిణీలు, బాలింతలను గుర్తించామని, తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా అధిక వర్షాలు కురిసే జిల్లాలోని 20 మండలాలకు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కొక్క మండలానికి మూడు చొప్పున మొత్తం 60 బస్సులను మండల కేంద్రాలలో సిద్ధంగా ఉంచాలన్నారు.

సచివాలయాల వద్ద జెసిబి యంత్రాలు, చెట్లు పడితే తొలగించడానికి కోత యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలోని 455 మొబైల్ ఫోన్ టవర్స్(Mobile Phone Towers), సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ భావన, డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్(D. R. O. G. Gangadhar Goud) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply