- అధికారులు ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
- నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు నారాయణపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిర్వహించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ, అధికారులకు విధుల కేటాయింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, బ్యాలెట్ పేపర్లను అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయాలని తెలిపారు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే జోనల్ అధికారులు, రూట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఊట్కూర్ మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలకు గాను 59 మంది సర్పంచ్ అభ్యర్థులు, 160 వార్డు స్థానాలకు 357 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొత్తం 41,780 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 20,469 మంది పురుషులు, 21,311 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మండలంలో మొత్తం 7 జోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ కొండన్న, ఉపాధి హామీ ఏపీఓ లక్ష్మారెడ్డి, ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

