ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు..

ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాదు ప్రాంతానికి చెందిన ఇద్దరు పిల్లల ఆచూకీ అనంతపురం జిల్లాలో లభించిందని సమాచారం. ఈనెల 26న కరీమాబాద్ కు చెందిన బాలిక యజ్ఞశ్రీ,(11) బాలుడు మణికంఠ (12) ఇద్దరు పిల్లలు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సాయంత్రం వెళ్ళిపోయారు. వారి ఆచూకీ గురించి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ విషయమై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఛాలెంజ్ గా తీసుకున్న మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమించారు. కరీమాబాద్ ప్రాంతంలోని రామ్ లక్ష్మణ్ థియేటర్ దగ్గర సీసీ ఫుటేజీలో ఇద్దరు పిల్లలు కలిసి వెళుతున్న దృశ్యం కనిపించింది.
దీనిని ఆధారంగా తీసుకొని మిల్స్ కాలనీ పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఇద్దరు పిల్లలు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఓ మహిళ ఇంటికి వెళ్లి తమకు ఆకలి అవుతుందని అడగడంతో ఆ మహిళ వీరి పూర్తి వివరాలు తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఇద్దరు పిల్లల గురించి వరంగల్ స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసుల వద్ద క్షేమంగా ఉన్నట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లల ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దొరికిన ఇద్దరు పిల్లలను మిల్స్ కాలనీ పోలీసులు వరంగల్ కు తీసుకొని వస్తున్నారని సమాచారం. దీంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది.
