వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు – మంత్రి కొల్లు

వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడుమంత్రి కొల్లు

మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ : తుపాను వచ్చిన పది రోజుల తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిందలు వేయడానికి సిగ్గుండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ధ్వజమెత్తారు. మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడ్డారు. తుపానుతో దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంట పరిశీలన నెపంతో వచ్చిన జగన్ రెడ్డి… బల ప్రదర్శన చేయాలనుకోవడం హేయం.

జగన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ యాత్ర చేశాడు. తుపానుతో రైతులు అవస్థలు పడుతున్నపుడు కనీసం పట్టించుకోకుండా.. ఎక్కడున్నావని ప్రశ్నించారు. తుపాను సమయంలో కూటమి ప్రభుత్వం(Coalition Govt) రైతులకు ఏమీ చేయలేదంటే ప్రజలే నమ్మడం లేదు. అందుకే డబ్బులిచ్చి జనాల్ని రప్పించుకుని విమర్శించే ప్రయత్నం కూడా బెదిసి కొట్టింది. మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త జంగాల వెంకటేశ్వరరావు అనే రైతుతో రామరాజుపాలెంలో రైతులకు ఏమీ అందడం లేదని మాట్లాడించారు.

మచిలీపట్నం రైతుకు పెడనలో సహాయం అందలేదని చెప్పించి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. పంటపొలాల్లోకి వెళ్లి గట్లపై నడుస్తూ.. సినిమా షూటింగులతో డ్రామాలాడారు. ఇంత వర్షం పడినా ఎక్కడా పంటలు ముంపునకు గురవ్వకపోవడానికి కూటమి ప్రభుత్వ పనితీరే నిదర్శనం. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క కాలువలో కూడా పూడిక తొలగించిన పాపాన పోలేదు. కూటమి అధికారంలోకి రాగానే పూడికలు(Poodikal) తొలగించాం. అందువల్లనే పంటల ముంపు నుండి రక్షించుకోగలిగాం.


తుపాను తీరం దాటిన 24 గంటల్లోనే ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం గురించి పూర్తి వివరాల సేకరణ ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంట, 1.83 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, 46 వేల కిలోమీటర్ల రోడ్లు పాడయ్యాయని గుర్తించాం. సుమారుగా రూ.5600 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదించాం.


తుపాను ప్రభావం మొదలైనప్పటి నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులంతా కూడా ప్రజల్లో ఉండి వారికి అండగా నిలిచారు. చంద్రబాబు గారు, లోకేశ్ గారు తుపాను ప్రభావం ఉన్న నాలుగు రోజులు ఆర్టీజీఎస్‌లో ఉండి పర్యవేక్షించారు. తీరం దాటిన వెంటనే ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత అమలాపురంలో పర్యటించి రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నష్ట అంచనా నివేదికలు తయారు చేయాలని సూచించారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మమేకమయ్యారు.

సముద్రం పోటెక్కినపుడు పంటలు దెబ్బతినడాన్ని ప్రత్యేకంగా చర్చించారు. చంద్రబాబు లండన్ వెళ్లారని, లోకేశ్ గారు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్లారని అనడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లారనడం హేయం. మహిళల్ని ప్రోత్సహించడం కోసం క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం హేయం. చంద్రబాబు లండన్ వెళ్లింది నీలా షాపింగుల కోసమో, ట్రీట్మెంట్(Treatment) కోసమో కాదు. ఈ నెల 14, 15న విశాఖ కేంద్రంగా జరిగే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించడానికి వెళ్లారు.

తన సతీమణికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అందించగా తోడుగా వెళ్లారు. జగన్ రెడ్డి తల్లిపై కేసు వేశాడు. చెల్లిని రోడ్డున వదిలేశాడు.కానీ చంద్రబాబు తన సతీమణికి ప్రతిష్టాత్మక అవార్డు వస్తే.. తోడుగా వెళ్లారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి బుద్ధి ఉందా?

Leave a Reply