Third Test| జడేజా సూపర్ బ్యాటింగ్ – అయిన భారత్ కు తప్పని ఓటమి

లార్డ్స్ : ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

193 పరుగల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కేఎల్ రాహుల్(39) పర్వాలేదనిపించాడు.

పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. జోఫ్రా ఆర్చర్(3/55), బెన్ స్టోక్స్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్‌, క్రిస్ వోక్స్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ ఓటమితో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన వృథా అయ్యింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.

కొంపముంచిన మిడిలార్డర్

58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసారు. జట్టును ఆదుకుంటాడని భావించిన రిషభ్ పంత్‌ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో సెట్ అయిన కేఎల్ రాహుల్‌ను బెన్ స్టోక్స్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌(0)ను ఆర్చర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 80 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

ఇంగ్లండ్ కవ్వింపులు

ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఆచితూచి ఆడారు. బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. దాంతో సహనం కోల్పోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. ఓవైపు నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరోవైపు రవీంద్ర జడేజాతో వాగ్వాదానికి దిగారు. వారి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. లంచ్ సెషన్‌కు ముందు నితీష్ కుమార్ రెడ్డి(13)ని క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో 8వ వికెట్‌కు నమోదైన 32 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

దాంతో టీమిండియా 112/8 లంచ్ బ్రేక్ వెళ్లింది.జడేజా ఒంటరి పోరాటం..రెండో సెషన్‌లో జడేజాకు బుమ్రా అండగా నిలిచాడు. ఈ ఇద్దరి ఆచితూచి ఆడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. బుమ్రా సాయంతో ఆచితూచి ఆడిన జడేజా పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమై సింగిల్స్ తీసాడు. బుమ్రా 54 బంతులాడి జడేజాకు అండగా నిలిచాడు. భారీ షాట్ ఆడే క్రమంలో బుమ్రా ఔటవ్వడంతో 9వ వికెట్‌కు నమోదైన 35 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా.. స్ట్రైకింగ్ ఉంచుకోవాలనే ఆలోచనతో జడేజా పరుగులు తీయలేదు. సిరాజ్ కూడా అండగా నిలవడంతో జడేజా తన పోరాటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో 150 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ. దాంతో టీమిండియా 163/9తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరి సెషన్‌లోనూ జడేజా-సిరాజ్ పట్టుదలగా ఆడారు. కానీ సిరాజ్‌ను షోయబ్ బషీర్ ఔట్ చేయడంతో భారత పోరాటం ముగిసింది.

.కేఎల్ రాహుల్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా.. నితీష్‌తో పాటు 8వ వికెట్‌కు 30 పరుగులు .. బుమ్రాతో కలిసి 9వ వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. ఆ తర్వాత సిరాజ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 23 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ పోరాటం ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌటైంది.

సంక్షిప్త స్కోర్లు:ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్ (జోరూట్ 104, బుమ్రా 5/74)భారత్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్( కేఎల్ రాహుల్ 100, క్రిస్ వోక్స్ 3/84)ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్( జోరూట్ 40, వాషింగ్టన్ సుందర్ 4/22)భారత్ రెండో ఇన్నింగ్స్170 ఆలౌట్( రవీంద్ర జడేజా 61 నాటౌట్, బెన్ స్టోక్స్ 3/48

టీమిండియా తరఫున ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి ఉన్నది.

Leave a Reply