కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా ఆయన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం మ్యాజిక్ డ్రెయిన్ ప్రాజెక్టును ప్రారంభించి శాసన సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరి ముఖాల్లో ఆనందం చూడటం తన కల అని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కర్తవ్యాన్ని నిబద్ధతతో కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
సూపర్ సిక్స్ – సూపర్ హిట్
తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సాధ్యం కాదని కొందరు ఎగతాళి చేసినా, వాటిని అమలు చేసి చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు. “ఎవరిని అడిగినా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అంటున్నారు” అని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సెలూన్లకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వివరించారు.
పరిశుభ్రత – స్వర్ణాంధ్ర లక్ష్యం
చెత్త, అపరిశుభ్రత వల్లే అంటువ్యాధులు వస్తాయని గుర్తుచేసిన సీఎం, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. “స్వర్ణాంధ్ర కావాలంటే మన ఆలోచన విధానం మారాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెత్తపై పన్నులు వేసి కూడా తొలగించలేదని విమర్శించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించే ప్రణాళికలపై కూడా దృష్టి పెట్టామన్నారు.
ఆరోగ్యం – అభివృద్ధి
పీ-4 పథకం ద్వారా పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, డ్రోన్ల సహాయంతో దోమల నివారణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వర్షాకాలంలో దోమల వల్ల రోగాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అలాగే పెద్దాపురంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించనున్నట్లు చెప్పారు. అమృత్ పథకం కింద పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో 75 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటి కుళాయిలు వేయిస్తామని ప్రకటించారు.
వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా, ఇంటింటికి కెళ్లి మరీ పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగవని, అందుకే సంపద సృష్టించి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని, ఇప్పటికే అనేకమంది పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పోలవరంను 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పదితరాల ముందుకు ఆలోచిస్తున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు.