Development |అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు

Development | అభివృద్ధి పనుల్లో జాప్యం తగదు

  • నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్
  • రహదారుల విస్తరణ పనులు మరింత వేగవంతం చేయండి
  • పీపీపీ పద్దతిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు

Development | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, టెండర్ల ద్వారా పనులు పొందినప్పటికీ ప్రారంభించని గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి నగరపాలక అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, సంబర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలోని 129 ఎకరాల్లో పీపీపీ ప్రాజెక్టుల ద్వారా నగర ప్రజలకు అధునాతన సౌకర్యాలు, కార్పొరేషన్‌కి ఆదాయం వచ్చేలా రూపకల్పన చేసిన ప్రతిపాదనలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు.

తాగునీటి సరఫరా మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, గుత్తేదారుల సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత తగదని హితవు పలికారు. ఇతర శాఖలతో సమన్వయం పెంచుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని, కల్లూరు దర్వాజ వద్ద బ్రిడ్జి పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

కార్పొరేషన్ ఆదాయం పెంపునకు కృషి చేయాలని, ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. ‌అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నగర అభివృద్ధి విషయంలో ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పీపీపీ పద్దతిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను ఆకర్షణీయంగా, అధునాతన సాంకేతిక అంశాలతో ఆహ్లాదకర వాతావరణంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సంబర్ స్టోరేజ్ ట్యాంకు సమీపంలోని 129 ఎకరాల అభివృద్ధికి ఐకానిక్ టవర్, భవన సముదాయాల ఏర్పాటు వంటి అంశాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్న రాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఇంచార్జ్ సీపీ బి.వెంకటరమణ, ఆర్‌ఓ జునైద్, ఎంఈ మనోహర్ రెడ్డి, ఏపీయస్‌పిడిసిఎల్ ఎస్‌ఈ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply