మక్తల్, ఆంధ్రప్రభ : మ‌క్త‌ల్ మున్సిపాలిటీ (Makthal municipality) లో నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించేందుకు రూ.15.28 కోట్లు మంజూరు చేసినప్పటికీ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తప్పడం లేదని మక్తల్ మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు మంజూరై నాలుగు నెలలు గడిచినా పనులు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు (Officials and public representatives) నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. నాలుగు నెలలుగా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, 15 రోజుల నుండి నీటి సరఫరా నిలిచిపోయింద‌ని మిషన్ భగీరథ (Mission Bhagiratha) అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

పట్టణం విస్తరించడం వల్ల నేషనల్ హైవే (National Highway) కు పడమర భాగంగా ఉన్న కొత్త పట్టణంలో 40లక్షల గ్యాలన్లతో రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని, పాత పట్టణంలో 60లక్షల గ్యాలన్లతో కెపాసిటీ గల మంచినీటి ట్యాంక్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలమూరు ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) నిధులు మంజూరు చేయించార‌ని చెప్పారు. పనులు ప్రారంభించాల్సిన అధికారులు పాలకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని మండిప‌డ్డారు. మూడు ట్యాంకుల నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని డిమాండ్ (demand) చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చరించారు.

ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ నాయకులు బి. రాజశేఖర్ రెడ్డి, దేవరింటి నరసింహారెడ్డి, సుకన్య శేఖర్, చీరాల సత్యనారాయణ, వెంకటగిరి బుగ్గన్న, బి.ఆంజనేయులు సూర్య, నరేందర్, కురువలింగం, రాజా గౌడ్, బి.రాజశేఖర్, బ్యాటరీ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply