అక్షరం ఆగింది.. పోరాటం నిలిచింది..

అక్షరం ఆగింది.. పోరాటం నిలిచింది..
దమ్మపేట, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి గత రాత్రి గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు. అనంతరం క్రాంతి అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా పాడె మోశారు. డప్పు కళాకారులతో డప్పు వాయించారు.
ఈ సందర్భంగా తాటి మాట్లాడుతూ.. అతిపిన్న వయసులోనే పీడిత ప్రజల కోసం అడవి బాట పట్టిన క్రాంతి, అలుపెరుగని పోరాటం చేసి బయటకు వచ్చి, అక్షరాన్ని ఆయుధంగా మలిచాడన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ములకలపల్లి ప్రజల గొంతుకై నిలిచిన ఆయన సేవలు వెలకట్టలేనివని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ ఎప్పటికీ గుర్తిండిపోతుందన్నారు.
అత్యంత సన్నిహితుడు.. విడదీయలేని బంధం..
తాటి వెంకటేశ్వర్లుకు, క్రాంతికి మధ్య ఉన్నది కేవలం రాజకీయ , వృత్తిపరమైన సంబంధం కాదు, అది ఒక పేగు బంధం లాంటిది. తాటి వెంకటేశ్వర్లు నిర్వహించే ఏ చిన్న కార్యక్రమమైనా, ఏ ప్రజా పోరాటమైనా క్రాంతి అక్కడ ఉండాల్సిందే. క్రాంతి నా కుడి భుజం లాంటి వాడని, తాను ఎక్కడికి వెళ్లినా నా నీడలా నా వెంటే ఉండేవాడన్నారు. ఇంతటి సన్నిహితుడు, తమ్ముడి లాంటి వ్యక్తిని ఇలా హఠాత్తుగా కోల్పోతానని కలలో కూడా అనుకోలేదని, ఈ లోటును ఏదీ పూడ్చలేదు” అని తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ జీవన విధానాన్ని అనునిత్యం వెలికితీస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం అనునిత్యం తపించిన వ్యక్తి, మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

