మక్తల్, జులై 17 (ఆంధ్రప్రభ) : ఉన్నోళ్లను దోచి పేదల కడుపు నింపిన మహానీయుడు పండుగ సాయన్న (panduga sayanna) అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (vakiti srihari) కొనియాడారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి వేడుకలను ఇవాళ మక్తల్ (Maktal) లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు (Congress leaders), ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలంలోనే ఉన్న వాళ్లను దోచి పేదోళ్లకు పెంచిన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పండుగ సాయన్న అన్నారు. కేవలం ఒక ముదిరాజ్ వర్గానికే కాకుండా ముదిరాజ్ బిడ్డగా ఆయన పేదల కష్టాలు తెలిసి ఉన్నవాళ్ల గడీలను బద్దలు కొట్టి పేదలకు పంచిపెట్టిన మహనీయుడని కొనియాడారు. అలాంటి మహనీయుడి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాల్లో పండుగ సాయన్న జీవిత చరిత్రను పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే జయంతి నాటికి పండుగ సాయన్న విగ్రహాన్ని మక్తల్ పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. పండుగల సాయన్న ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, డైరెక్టర్లు పసుల రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కోళ్ల వెంకటేష్, నాయకులు వాకిటి అంజయ్య, తిరుపతి నర్సింలు, కట్ట వెంకటేష్, వల్లంపల్లి లక్ష్మణ్, గోవర్ధన్, కున్సి నాగేందర్, కాంగ్రెస్ నాయకులు కె.నాగిరెడ్డి, నీల గౌడ్, తదితరులు పాల్గొన్నారు.