మహా కుంభాభిషేక మహోత్సవం..

మహా కుంభాభిషేక మహోత్సవం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నుండి ప్రారంభమైంది. ఆలయ శుద్ధి, పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా జరిగే ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానం మొత్తం పవిత్రీకరణతో పాటు ఆలయ శక్తి పునరుద్ధరణకు ఈ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం హాజరవుతారని అంచనా వేస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ తెలిపారు. భక్తుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు, క్యూలైన్‌లు, తాగునీరు, వైద్యసదుపాయాలు వంటి అన్ని వసతులు కల్పించామని చెప్పారు.

అదే విధంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ.. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మహోత్సవాన్ని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ మహా కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.

Leave a Reply