- భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో నీటి ప్రవాహం
- 47 అడుగులకు చేరిన నీటి మట్టం
- తూరుబాక వద్ద తాత్కాలిక వంతెన మునక
- వరంగల్-కొత్తగూడెం జిల్లాల మధ్య స్తంభించిన రాకపోకలు
భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట తర్వాత 43 అడుగులు దాటడంతో జిల్లా యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరిక ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 44.3 అడుగుల వద్ద ఉన్న గోదావరి, సాయంత్రం ఏడు గంటలకు 47 అడుగులకు చేరింది. మరో ఒక అడుగు నీటి మట్టానికి చేరితే రెండో ప్రమాద హెచ్చరిక (Second hazard warning) జారీ చేస్తారు.
తూరుబాక వద్ద తాత్కాలిక వంతెన మునిగిపోవడంతో వెంకటాపురం (Venkatapuram) రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దీంతో వరంగల్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు వచ్చే మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆంధ్రలోని నెల్లిపాక గ్రామం వైపు వెళ్లే రహదారి పై గోదావరి నీరు చేరుతుంది. మరింత పెరిగితే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయి.