విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి
సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మోత్కూర్, ఆంధ్రప్రభ : సంక్షేమ హాస్టల్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.శనివారం మున్సిపల్ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థుల వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించారు.హాస్టల్ లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని ,ఎంత మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, టీచర్స్ అందరు స్థానికంగా ఉంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

స్కూల్ లో మంచి నీటీ సదుపాయం , టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయా లేవా అని కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు . ప్రతి రోజు రెగ్యులర్ గా శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.చుట్టూ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.విద్యార్థులకి మధ్యాన్నం భోజనం మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా అని విద్యార్థులను ఆరా తీశారు. కిచెన్ రూమ్ లోకి వెళ్లి వంట సామాగ్రి ని, స్టోర్ రూమ్ లో వంట సరుకులు,కూరగాయలు, పప్పు, ధాన్యాలు, గుడ్లు, ఆయిల్ క్వాలిటీ వాడుతున్నారా లేదా అని స్వయంగా పరిశీలించారు. నాణ్యమైన వంట సరుకులు,తాజా కూరగాయలు మాత్రమే వాడాలన్నారు.
హిమేష్ అనే విద్యార్థి తో కలెక్టర్ మాట్లడుతూ ఏ క్లాస్ చదువుతున్నావ్, బాగా చదువుతున్నావా, పెద్ద అయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నావ్ అని విద్యార్థిని అడగడం జరిగింది. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల తో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ నాయక్,మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్,ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మొలకల స్వామి ,ఎంపీఓ జనార్ధన్ రెడ్డి,ఆర్ ఐ సుమన్,ఏ ఎస్ ఐ వెంకన్న లు ఉన్నారు.

