సింగ‌రేణి ఉద్యోగుల‌కు కొత్త క్వార్ట‌ర్లు

సింగ‌రేణి ఉద్యోగుల‌కు కొత్త క్వార్ట‌ర్లు

  • సింగరేణి వ్యాప్తంగా వెయ్యి కోట్ల‌తో నిర్మాణం… గోదావ‌రిఖ‌నిలో సింగరేణి చైర్మన్ , ఎండీ బలరాం నాయ‌క్ వెల్ల‌డి
  • కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • కోల్ బెల్ట్ ఏరియా పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతాం

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : సింగరేణి బొగ్గు పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కార్మికుల అవసరాల కోసం ప్రత్యేకమైన మౌలిక వసతులతో సింగరేణి వ్యాప్తంగా కొత్తగా వెయ్యి కోట్ల క్వార్ట‌ర్లు నిర్మాణం చేపడుతున్నట్లు సింగ‌రేణి చైర్మన్, ఎండీ బలరాం నాయక్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఆయ‌న‌ పర్యటించారు. స్థానిక గాంధీనగర్ ఏరియాలోని సింగరేణి క్వార్టర్ల స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రస్తుతం సింగరేణి క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో ప్రత్యేకమైన మౌలిక వసతులతో డబుల్ బెడ్ రూమ్ జి ప్లస్ తరహాలో నిర్మించదలచిన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలతో నేరుగా మాట్లాడారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇక్కడ కార్మికుల సౌకర్యార్థం మోడ్రన్ పద్ధతిలో కొత్తగా క్వార్టర్స్ నిర్మాణం చేపడుతున్నామని ఇందుకు అందరూ సహకరించాలని మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని చైర్మన్ బలరాం నాయక్ కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించారు. అనంతరం బలరాం నాయక్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.

వందల కోట్ల రూపాయల నిధులతో సింగరేణి బొగ్గు పరిశ్రమవ్యాప్తంగా 1000 కోటర్ల నిర్మాణం చేపడుతుండగా రామగుండం రీజియన్ గోదావరిఖని పట్టణంలో 318 కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపడుతున్నామని అదేవిధంగా శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూరు ప్రాంతాల్లో కూడా కొత్త కోటర్ల నిర్మాణం చేపడుతున్నట్లు చైర్మన్ బలరాం చెప్పారు. గోదావరిఖని పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన క్వార్టర్ల నిర్మాణం అతి త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. కార్మికులు కార్మిక కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం సింగరేణి బొగ్గు పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను ఆధునికరిస్తున్నామని… దీనిలో భాగంగా కార్మికుల హెల్త్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వివరించారు.

గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో ఆధునికరణ చేపడుతున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. అదేవిధంగా కార్మికుల ఆరోగ్య అవసరాల కోసం సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టబోతుందన్నారు. బొగ్గు ఉత్పత్తులను పెంచడమే కాకుండా, కార్మికుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని… కార్మిక వర్గానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదేనని బలరాం నొక్కి చెప్పారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పై యాజమాన్యం స్పెషల్ ఫోకస్ చేసిందన్నారు. ఈ కార్యక్రమాల గోదావరిఖని పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని తెలిపారు.

అదేవిధంగా కోట్లాది రూపాయల నిధులతో కార్మిక వాడల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో చేపడుతున్నట్లు చైర్మన్ బలరాం నాయకులు ఈ సందర్భంగా వివరించారు. సింగరేణిలో మెడికల్ బోర్డు జాప్యంపై చైర్మన్ బలరాం నాయక్ స్పందిస్తూ కార్మికుల అవసరం మేరకు… మెడికల్ బోర్డు ప్రాధాన్యతను సాధ్యమైనంత తొందరలో పరిశీలన చేసి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చైర్మన్ బలరాం నాయక్ వెంట రామగుండం-1 జిఎం డి లలిత్ కుమార్, సివిల్ డీజిఎం వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తోపాటు పలువురు సింగరేణి అధికారులు ఉన్నారు.

ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సందర్శన
సింగరేణి చైర్మన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు -5 నీ సందర్శించారు. అక్కడ బొగ్గు ఉత్పత్తులు ఉత్పాతకత వివరాలను తెలుసుకున్నారు. దీంతోపాటు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు వద్ద సింగరేణి అధికారులతో చైర్మన్ బలరాం నాయక్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించబడిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అంశాలపై అధికారుల నుండి వివరాలను సేకరించారు. ఉత్పత్తుల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను అధికారులకు సూచించారు. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను ఛేదించడంలో బాధ్యత అద్భుతంగా కార్మికులు అధికారులు ఐక్యంగా పనిచేయాలని చైర్మన్ బలరాం నాయక్ పిలుపునిచ్చారు.

Leave a Reply