నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ ఆటపై ఉత్కంఠ నెలకొంది.
తరతరాల సంప్రదాయం..
నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.
అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడతారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకుంటారు.
ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి గ్రామస్థులు పిడిగుద్దులాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఆటకు సిద్ధమవుతున్నారు. కాగా, దీనిపై ఆంక్షలు విధించడంతో పాటు అనుమతిని పోలీసులు నిరాకరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.