TG | ఖజానా ఖాళీ! లోన్‌ కోసం వెయిటింగ్‌

తెలంగాణ ఆదాయం, ఖ‌ర్చుల‌పై కాగ్ నివేదిక
ఏప్రిల్ నెల ఆదాయం ₹16,473
శాలరీస్, పెన్షన్స్, అప్పులపై వడ్డీలు, కిస్తీలకే ₹12 వేల కోట్లు
జీతాల‌కు ఏకంగా ₹3968 కోట్లు
పెన్ష‌న్ల కోసం ₹1569 కోట్లు చెల్లింపులు
రుణాల‌పై వ‌డ్డీల‌కు ₹ 2200 కోట్లు
రుణ బ‌కాయిల‌కు ₹4 వేల కోట్లు
కొంత సొమ్ము కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లింపులు
అభివ‌ద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధుల కొర‌త‌

హైద‌రాబాద్, ఆంధ్రప్రభ :

తెలంగాణ స‌ర్కారుకు ఏప్రిల్​ నెలలో అన్ని రకాలుగా కలిపి ₹16,473 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ₹12 వేల కోట్లకుపైగా నిధులు జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే పోయాయి. మిగిలిన నాలుగున్నర వేల కోట్ల ఆదాయంలో ప్రతినెలా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు, గ్రీన్​చానెల్​కింద మంజూరు చేయాల్సిన ఇతర కొన్ని ముఖ్య పథకాలకు ఖర్చు చేయగా మరికొన్ని నిధులతో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లించారు. దీంతో కొత్త స్కీమ్​లను ప్రకటించినప్పటికీ.. వాటిని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక వివ‌రాలు శుక్రవారం కాగ్ రిలీజ్ చేసిన నివేదికలో వెల్లడయ్యాయి.

అప్పుల‌పై వ‌డ్డీభారం మ‌రింత‌..

గతేడాది ఏప్రిల్‌లో జీతాల కోసం రూ.3,847 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.3,968 కోట్లకు పెరిగింది. పెన్షన్ల కోసం పోయినసారి రూ.1,335 కోట్లు ఖర్చు చేయగా, మొన్న ఏప్రిల్‌లో ఇది రూ. 1,569.86 కోట్లకు చేరింది. మరోవైపు అప్పులపై వడ్డీలు కూడా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1,900 కోట్ల వరకు చెల్లింపులు చేయగా.. ఈ ఏప్రిల్ నాటికి ఇది రూ.2,260 కోట్లకు ఎగబాకింది. వీటికి తోడు కిస్తీలకు ఈసారి ఏప్రిల్​ నెలలో 4వేల కోట్ల రూపాయాలపైనే చెల్లించారు. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోంది.

ఏడాదిలో 5,230 కోట్ల‌కు చేరిన అప్పులు..

2024 ఏప్రిల్‌లో రూ.2,246 కోట్లు అప్పులు చేయగా.. ఈసారి ఇది రూ.5,230 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) తగ్గుముఖం పట్టింది. పోయినేడాది ఏప్రిల్‌లో రూ.3,119 కోట్ల మూలధన వ్యయం ఉండగా, మొన్నటి ఏప్రిల్‌లో ఇది రూ. 1,204 కోట్లకు తగ్గింది. మూలధన వ్యయం తగ్గడం అంటే మౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గిపోవడమేనని, ఇది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆదాయం పెరిగినా.. ట్యాక్స్​ రాబడి డౌన్

ఓవరాల్​గా పోయిన ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఆదాయం.. ఈ సారి ఏప్రిల్​తో చూస్తే రూ.2 వేల కోట్ల పైనే పెరిగింది. కానీ, ఇందులో పన్నుల ఆదాయం రూ.600 కోట్లు పడిపోయింది. అయితే, అప్పులు ఎక్కువగా తీసుకోవడంతో మొత్తం ఆదాయం పెరిగిందని.. సాధారణంగా గతంతో చూస్తే కొంత రాబడి తగ్గినట్టేనని ఆఫీసర్లు అంటున్నారు.

Leave a Reply