ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న కర్షకలోకానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. సువిశాల ప్రపంచంలో తమ రెక్కల కష్టంతో పనిచేసి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్న శ్రమవీరులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.
మే డే అంటేనే ప్రజా ఉద్యమాలను, ప్రగతిశీల పోరాటాలను స్మరించుకునేలా చేస్తుందని గుర్తు చేశారు. కార్మికుల హక్కులను సాధించుకునే క్రమంలో చిందించిన రుధిరాశృలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ నేల మీద నిజాంకు ఎదురొడ్డి వెట్టి చాకిరి నిర్మూలనకు బందూకులు పట్టి.. ప్రాణాలు తృణ ప్రాయంగా వదిలిన వీరబిడ్డలను కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం కూడా హక్కుల సాధన కోసం.. విముక్తి కోసం.. స్వేచ్ఛ కోసం సాగించిన మహోద్యమమే అని చెప్పక తప్పదన్నారు.
శ్రమని గుర్తిద్దాం.. శ్రామికుడిని గౌరవిద్దాం.. మరొక్కసారి కార్మిక, కర్షక, శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.