TG CM | మూసీ నది ప్రక్షాళన చేస్తాం

TG CM | మూసీ నది ప్రక్షాళన చేస్తాం
TG CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ కార్యక్రమం దేవుడి నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని సీఎం అన్నారు. మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మూసీ నది శుద్ధీకరణ కోసం గతంలో పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ బాధ్యత తమ ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం సాధారణ పనికాదు, ఒక పవిత్ర బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
నదీ తీరాల చుట్టూనే నాగరికతలు వికసించాయని, సముద్ర తీర ప్రాంతాల్లోనే ప్రముఖ నగరాలు అభివృద్ధి చెందాయని సీఎం గుర్తు చేశారు. దేశాల అభివృద్ధికి నదులు, సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అయితే నదీ జలాలను సక్రమంగా వినియోగించకపోవడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని, తెలియకపోయినా, తెలిసినా మనమే నదులను కలుషితం చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
కాలుష్య ప్రభావం ఎంత తీవ్రమైందో దిల్లీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నదిని పూర్తిగా శుద్ధి చేయాలని సంకల్పించామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
