TG | బస్సు డ్రైవర్ అజాగ్రత్త !!

  • విద్యార్థిని చేతికి తీవ్రగాయం
  • బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హెచ్ఈసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న మేఘన అనే విద్యార్థిని ప్రమాదానికి గురైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు.

కరీంనగర్ డిపో–2 కు చెందిన పల్లె వెలుగు బస్సు లో ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వెనక్కి తీసుకోవడంతో విద్యార్థిని కింద పడిపోయి, ఆమె ఎడమ చెయ్యి తీవ్రంగా గాయపడిందని ఆయన తెలిపారు. విద్యార్థిని చెయ్యి నుజ్జు నుజ్జు అవడం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లేనని అక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్పినట్లు ప్రీతం అన్నారు.

డ్రైవర్ ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, గాయపడిన మేఘనకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని పూర్తిగా కోలుకునే వరకు డ్రైవర్ బాధ్యత వహించేలా చూడాలని డిమాండ్ చేశారు.

బస్సు పాస్ ఉన్న విద్యార్థులను బస్సులోకి ఎక్కించకుండా కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు బస్సులో ఎక్కే వరకు సమయం ఇవ్వడం, అందరూ ఎక్కిన తర్వాతే బస్సును స్టార్ట్ చేయడం తప్పనిసరి చేస్తేనే ఇటువంటి ఘటనలు నివారించగలనన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply