TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు

హైదరాబాద్| స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలన్నారు

కేటీఆర్.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు కేటీఆర్. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు.

రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని తెలియచేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరాఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని చెప్పాలన్నారు. రేవంత్ ప్రభుత్వ చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారి గ్రామాల్లో పారిశుద్ద్యం పడకేసిందన్న సంగతిని చెప్పాలన్నారు. బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేని కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న డ్రామాలను ప్రజలకు విడమిర్చి చెప్పాలన్నారు. ఇంతేకాకుండా వివిధ రంగాలకు డిక్లరేషన్ ల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయా రంగాలను మోసం చేసిన తీరును వివరించాలన్నారు.

వృద్దులకు పెంచుతానన్న 4 వేల రూపాయల పెన్షన్ తో పాటు ఆడబిడ్డలకు నెలకు ఇస్తానన్న 2500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహాలను విడమరిచి చెప్పాలన్నారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఈ వారంలోనే ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరిగేలా చూడాలన్నారు.

Leave a Reply