హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి కి తెలంగాణ హైకోర్టు లో ఊరట లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల కేడర్ కేటాయింపులలో భాగంగా.. అతన్ని ఏపీకి వెళ్లాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. కాగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. అలాగే తన రిలీవింగ్ పై క్యాట్ విచారణ ముగిసే వరకు తనను రిలీవ్ చేయవద్దని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. అభిషేక్ మహంతి పిటిషన్ ను త్వరగా తేల్చాలి అని క్యాట్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. క్యాట్ లో విచారణ తేలే వరకు తెలంగాణ నుంచి ఆయనను రిలీవ్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2011 బ్యాచ్ ఐపీఎస్ క్యాడర్
అభిషేక్ మహంతి 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.. ఆయన తన స్థానికత (డొమిసైల్) ఆధారంగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని కోరుకున్నారు. అయితే.. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల ప్రకారం.. అతనికి ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. ఈ కేటాయింపును సవాలు చేస్తూ అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ని ఆశ్రయించారు. 2021 జులైలో సీఏటీ , అభిషేక్ మహంతిని తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతని స్థానికత హైదరాబాద్‌కు చెందినదని, అందువల్ల తెలంగాణ కేడర్ కు అర్హుడని తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అతన్ని కేడర్‌లోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని రిలీవ్ చేసినప్పటికీ, తెలంగాణలో అతనికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అతను జీతం లేకుండా కొన్ని నెలలు గడిపారు. ప్రస్తుతం అభిషేక్ మహంతి కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది.