న్యూఢిల్లీ – తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ కమిటీని సోమవారం లోపు ఏర్పాటు చేస్తామన్నారన్నారు. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్రాల నిపుణులు ఉంటారని చెప్పారన్నారు.
న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ లతో నేడు సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చలు జరిగాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కృష్ణా బోర్డు అమరావతిలో.. గోదావరి బోర్డు హైదరాబాద్ లో
ఆ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై ఈ సందర్భంగా చర్చించామన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం పేర్కొన్నారని తెలిపారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేసేలా నిర్ణయించామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకారించిదన్నారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటుకు సైతం అంగీకరించామని మంత్రి నిమ్మల వివరించారు.
బనకచర్లపై..
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ ఆవశ్యతను సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఈ నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతానికి లబ్ది చేకూరుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా ఈ భేటీలో వివరించారని సమాచారం.
అలాగే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు ఆయన అందజేశారు. ఏ ఒక్క రాష్ట్రానికి ఇబ్బంది కలిగించకుండా.. సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని 13 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని సమాచారం.