అభివృద్ధిలో వేగవంతమైన చర్యలు
ఆర్థికవృద్ధికి తోడ్పాటుగా పెట్టుబడులు
పకడ్బందీగా ఆరు గ్యారెంటీల అమలు
రైతుల సంక్షేమమే కీలకంగా నిర్ణయాలు
మహిళలకు చేయూనిచ్చే కార్యక్రమాలు
ఎస్పీఎస్సీ, లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ బలోపేతం
అయిదు అంశాలతో రోడ్ మ్యాప్ తయారీ
ప్రపంచానికి దిక్సూచిలా మారనున్న తెలంగాణ
వందేండ్ల కార్యాచరణకు సీఎం రేవంత్ సన్నద్ధం
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని భాగంగా చేసింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను పకడ్బందీగా లబ్ధిదారులందరికీ అందేలా చూడటం, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, వరి ధాన్యానికి బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఈ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది.
మహిళలకు వరంగా పథకాలు..
అంతేకాకుండా.. గృహ జ్యోతిపథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్‌ను 32 లక్షల కుటుంబాలకు రేవంత్ సర్కారు అందిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాలు లబ్ధిదారులందరికీ అందే ప్రణాళికలను ఈ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రజా అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి కలగాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమాన్ని తెలంగాణ రైజింగ్-2047లో భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారదర్శక పాలనలో మార్గదర్శిగా తెలంగాణ
పారదర్శక పాలనలో మార్గదర్శిగా నిలవాలన్న లక్ష్యాన్ని తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరైన పాలన అందించడం, ప్రతీ నిర్ణయం పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండేలా లక్ష్యాలను నిర్దేశించుకోనుంది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ, లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటి సంస్థలను బలోపేతం చేయడం ఇందులో భాగంగా చెప్పవచ్చు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూడా సీఎం రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుని కఠిన చర్యలు చేపడుతోంది.
అన్నింటికీ అభయహస్తంలా..
పలు కీలక అంశాలనే ఓ రోడ్ మ్యాప్‌గా తీసుకుని తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌ను రూపొందించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, హైదరాబాద్ నగర అభివృద్ధి, మానవ వనరులు- నైపుణ్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన వంటి ఐదు అంశాలు కీలకమని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అయిదు వేళ్లతో హస్తం ఎలా రూపొందుతుందో.. ఈ ఐదు అంశాలతో విజన్ డాక్యుమెంట్ సమగ్రంగా రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు.
============
పాలకులు మారినా విధానాలు మారలేదు
‘‘తెలంగాణ ఆవిర్భవించాక పాలకులు మారినా… పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల్లో మార్పు రాలేదు. అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు గత 30 ఏళ్లుగా పెట్టుబడుల ప్రవాహం ఆగలేదు. జంటనగరాల తర్వాత సైబరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మేం మహేశ్వరం మండలంలోని ముచ్చర్ల-బేగరికంచ గ్రామాల మధ్య నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నాం. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జపాన్, అమెరికా, సింగపూర్, స్విట్జర్లాండ్ (దావోస్) వెళ్లినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సౌకర్యాలున్న నగరాలతో పోటీపడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకనుగుణంగానే కార్యాచరణ రూపొందించాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ పలు వేదికలలో స్పష్టం చేశారు.
============
అన్నిశాఖలు సమాయత్తం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘మిషన్ కర్మయోగి’ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ అయింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధికి మిషన్ కర్మయోగి చేపట్టిన శిక్షణ కార్యక్రమాలను ‘కెపాసిటీ బిల్డింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు డాక్టర్ అల్కా మిత్తల్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..‘ఇప్పటికే తెలంగాణలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ తదితర సంస్థలు సమర్థంగా పలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నాయి’ అని తెలిపారు.