అఖిలపక్ష నాయకుల సమావేశం..

అఖిలపక్ష నాయకుల సమావేశం..
లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నియోజకవర్గాల పెంపుపై చేసిన ప్రకటనతో, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెరుగుదల నేపథ్యంలో లక్షెట్టిపేటను తిరిగి నియోజకవర్గంగా ఏర్పాటుకై అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. సోమవారం కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన స్థానిక ఐబీ విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశానికి జన్నారం, దండేపల్లి,లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల నాయకులు పాల్గొని కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, మేధావులు, సామాజిక వేత్తలు మాట్లాడుతూ…. గతంలో మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట నియోజకవర్గంగా ఉండేదని, అప్పటి నిజాం ప్రభుత్వం నుంచి ఈ పట్టణం తాలూకాగా ఉండి, ఎంతో గొప్ప చరిత్రను కలిగిన విషయం మరువలేనిదన్నారు.

లక్షెట్టిపేటను తిరిగి నియోజకవర్గం చేయడానికి మొదలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న పెద్ద ఎత్తున పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాల్గొని మండల అధికారులకు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. లక్షెట్టిపేటకు పూర్వవైభవం రావాలంటే నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అందరం కలిసికట్టుగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పటికే అభివృద్ధి విషయంలో లక్షేట్టిపేటకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు మంచిర్యాలకు తరలి వెళ్లడం జరిగిందని పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్లు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా నాయకులు మున్నా రాజ సిశోడియా, మండల, పట్టణ అధ్యక్షులు,సీపీఐ నాయకులు అశోక్, సీఐటీయూ నాయకులు రంజిత్,బీసీ సంఘం నాయకులు చుంచు రాజ్ కిరణ్,కౌన్సిలర్లు మైలారపు సుధాకర్, పెట్టెం తిరుపతి, నాయకులు శ్రీనివాస్ రావు, గాదె సత్యం,గోళ్ళ రాయమల్లు,అంకతి గంగాధర్,షేక్ చాంద్,అంకతి రమేష్,కోమాకుల రవి, తొగరు ప్రభాకర్, కళ్యాణం రవి,న్యాయవాది రెడ్డిమళ్ళ ప్రకాశంతో పాటు సుమారు 100 మంది పాల్గొనగా, దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కానట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6న అన్ని మండలాల నుంచి పార్టీలకతీతంగా హాజరై నియోజకవర్గ సాధన కమిటీని వేసుకోవాలని తీర్మానించుకున్నారు.
