చేనేత రుణాలను మాఫీ చేయాలి..

చేనేత రుణాలను మాఫీ చేయాలి..
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
సమస్యలను పరిష్కరించి చేనేత సంఘాలను బలోపేతం చేయాలి
ఎంపీ చామల కు వినతి
డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చేనేత రుణాలను మాఫీ చేసి సంఘాలను బలోపేతం చేయాలని కోరుతూ డిసిసిబి మాజీ డైరెక్టర్ చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామ చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. చేనేత సహకార సంఘాల సమస్యలు, వాటి పూర్వాపరాలను వివరించారు. గత ప్రభుత్వాల పాలనలో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో అమలు చేసిన త్రిపుల్ ఆర్ పథకం ద్వారా చేనేత సహకార సంఘాల నష్టాలను పరిష్కరించి సంఘాలను బలోపేతం చేయడానికి చేసిన కృషిని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
అదే పరంపరలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను మాఫీ చేసి, ప్రస్తుతం నష్టాల్లో ఉన్న సంఘాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఎంపీ ని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుండి క్యాష్ క్రెడిట్ రూపంలో వ్యాపారం నిర్వహించేందుకు రుణాలు తీసుకున్నాయని, కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ రుణాలు వినియోగించ బడినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 35 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, ఈ రుణాల నుండి చేనేత సహకార సంఘాలను విముక్తి చేసి ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఎంపీ ని కోరారు.
రుణమాఫీ అనంతరం త్వరలోనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి సంఘాలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాల బలోపేతం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, సహకార సంఘాల గౌరవ అధ్యక్షులు భారత వాసుదేవ్, సహకార సంఘాల యూనియన్ అధ్యక్షులు అప్పం రామేశ్వరం, గుండాల సంఘం అధ్యక్షులు దుడుక ఉప్పలయ్య, కోయలగూడెం సహకార సంఘం అధ్యక్షులు గడ్డం జయశంకర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సూరేపెళ్లి శ్రీనివాస్, సీత చక్రపాణి, జిల్లా లక్ష్మీనారాయణ, ఏల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
